తెలంగాణ పల్లెలు, కళలు, సంప్రదాయాలను, బతుకమ్మ పండుగను అద్భుతంగా చూపించిన సందేశాత్మక చిత్రం తుపాకిరాముడు అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రశంసించారు. బిత్తిరి సత్తి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని రసమయి ఫిల్మ్స్ పతాకంపై ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించారు. టీ ప్రభాకర్ దర్శకత్వం వహించారు. ఈ నెల 25న విడుదలకానున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై పాటలను, ట్రైలర్‌ను విడుదలచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిర్మాత, దర్శకుడు, నటీనటులంతా తెలంగాణవారే ఉన్న ఈ చక్కటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని, వందరోజులు ఆడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తీసిన సినిమా తర్వాత రసమయి బాలకిషన్ తుపాకిరాముడుతో ముందుకొచ్చారని, ఈ సినిమాతో ఆయన సాహసోపేత ప్రయత్నం చేశారని అన్నారు.
యావత్ తెలుగు ప్రజలకు బిత్తిరి సత్తిగా చిరపరిచితుడైన చేవెళ్ల రవి ఈ సినిమాతో మరింత పేరుతెచ్చుకోవాలని, అద్భుతమైన నటుడిగా ఎదగాలని కోరుకుంటున్నానని మంత్రి హరీశ్ తెలిపారు. ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రసమయి బాలకిషన్ చక్కటి సృజనాత్మకత కలిగిన కళాకారుడన్నారు. ఈ సినిమా విజయవంతమై ఆయనకు మంచిపేరు రావాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తీసిన అనేక సినిమాల్ని అక్కున చేర్చుకున్నట్లుగానే తుపాకిరాముడును ప్రేక్షకులు ఆదరించాలన్నారు.