వానకాలం సీజన్‌లో పండించిన వివిధ వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖలు సర్వం సిద్ధం చేశాయి. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురియడంతో వానకాలం సీజన్లో ప్రధానంగా వరి, పత్తి, మక్కజొన్న, సోయాబీన్, కందులు, పెసర్లు, మినుములు పెద్ద ఎత్తున మార్కెట్‌కు రానున్నాయి. దీనిని ముందుగానే అంచనావేసిన వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖలు వ్యవసాయ ఉత్పత్తులన్నింటినీ మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాయి. పంటలకు మద్దతు ధర పొందేలా తీసుకోవాల్సిన చర్యలపై మార్కెటింగ్‌శాఖ అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో రైతులు పెద్ద ఎత్తున ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తమ వ్యవసాయ ఉత్పత్తులను తీసుకొస్తున్నారు. పండిన ప్రతి ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోళ్లను పౌరసరఫరాలశాఖ ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 2,584 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసింది.
ప్రభుత్వం ఏర్పాటుచేసిన మద్దతు ధర కొనుగోలు కేంద్రాల్లో పెసర్లు, సోయాబీన్ కొనుగోళ్లు వారంరోజులుగా జోరుగా సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పెసర్లకు క్విటాల్‌కు రూ.7050, సోయాబీన్ రూ.3,710 మద్దతు ధరగా నిర్ణయించింది. పెసర్లు 10,378 టన్నులు, సోయాబీన్ 58,608 టన్నులు మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌కు అనుమతిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పెసర్ల కొనుగోలుకు 14, సోయాబీన్ కొనుగోలుకు 7 కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇప్పటివరకు 5,160 మంది రైతుల నుంచి రూ.33.63 కోట్ల విలువైన 4,769 మెట్రిక్ టన్నుల పెసర్లు, 69 మంది రైతుల నుంచి రూ.0.42 కోట్ల విలువైన 113 మెట్రిక్ టన్నుల సోయాబీన్ కొనుగోలు జరిగినట్టు మార్కెటింగ్ అధికారులు వెల్లడించారు.